‘నిన్ను చంపెయ్యాలని ఉంది’.. అమెరికా అమ్మాయి మెసేజ్‌కి షాకైన తనికెళ్ళ భరణి!
on Oct 7, 2024
నటీనటుల్లో కొందరు సహజ నటన ప్రదర్శిస్తారు. కొందరు తాము చేస్తున్న క్యారెక్టర్‌కి జీవం పోస్తారు. మరి కొందరి నటన కృత్రిమంగా కనిపిస్తుంది. అయితే సహజంగా నటించే వారే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. అలాంటి నటీనటులు సినిమా పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు. వారిలో ఒకరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అతనే తనికెళ్ళ భరణి. భరణి నటుడు కావడానికి ముందు రచయిత. ఎన్నో సినిమాలకు మాటలు రాశారు. అంతేకాదు, నాటక రంగంలో విశేషమైన పేరు సంపాదించుకున్నారు. నాటకాల్లో, సినిమాల్లో తనికెళ్ళ భరణి ఎక్కువగా నెగెటివ్ క్యారెక్టర్స్‌లోనే రాణించారు. విలన్ ఇంత దారుణంగా ఉంటాడా, ఇంత క్రూరంగా ప్రవర్తిస్తాడా అనే రేంజ్‌లో అతను చేసిన క్యారెక్టర్లు వుండేవి. అలాంటి క్యారెక్టర్లు చెయ్యడం ద్వారా ఎంతో మంది ఆగ్రహానికి కూడా గురయ్యారు భరణి. అలాంటి కొన్ని ఘటనల గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
తనికెళ్ళ భరణి చేసిన విలన్ క్యారెక్టర్స్‌లో ఎక్కువ పేరు తెచ్చింది అప్పారావు క్యారెక్టర్. మాతృదేవోభవ చిత్రంలో అప్పారావు అనే పాత్ర పోషించారు. మద్యానికి బానిసైన సత్యం తన భార్య ఎక్కువ రోజులు బ్రతకదని తెలుసుకొని కుమిలిపోతాడు. భార్య కోసం తన అలవాట్లను మార్చుకుంటాడు. అంతకుముందే అప్పారావుకు, సత్యంకు శత్రుత్వం ఉంటుంది. సత్యాన్ని ఎలాగైనా మట్టుపెట్టాలని చూస్తున్న అప్పారావుకు ఆ అవకాశం వస్తుంది. దారి కాచి అతనిపై కత్తితో దాడి చేస్తాడు. ఆ సమయంలో ‘నేను చచ్చిపోతే నా భార్య, పిల్లలు దిక్కులేని వారైపోతార్రా.. నన్ను చంపొద్దు అప్పారావ్’ అంటూ వేడుకుంటాడు సత్యం. కానీ, విచక్షణ కోల్పోయి రాక్షసుడిగా మారిపోయిన అప్పారావు అతని మాటలు పట్టించుకోడు. అతన్ని దారుణంగా హతమారుస్తాడు. ఇది మాతృదేవోభవ చిత్రంలో ఎంతో కీలకమైన సన్నివేశం. ఈ సినిమా చూసిన వారెవరైనా అప్పారావు క్యారెక్టర్‌ని తిట్టకుండా ఉండరు. ఎందుకంటే ఆ క్యారెక్టర్‌లో భరణి అంత సహజంగా కనిపిస్తారు.
తనికెళ్ళ భరణి అలాంటి ఎన్నో దుష్ట పాత్రలు పోషించారు. వాటిలో ఆమె చిత్రం కూడా ఒకటి. ఆ సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్‌కీ తిట్లు తప్పలేదు. సినిమాల్లో తను చేసిన క్యారెక్టర్లపై ప్రేక్షకుల స్పందన నిజ జీవితంలో ఎలా ఉందో వివరిస్తూ ‘నా కెరీర్‌లో బాగా పేరు తెచ్చిన క్యారెక్టర్, నా కెంతో నచ్చిన క్యారెక్టర్ మాతృదేవోభవలో చేశాను. అలాగే ఆమె చిత్రంలో చేసిన క్యారెక్టర్ కూడా నాకు ఇష్టమే. అయితే ఈ రెండు క్యారెక్టర్స్ చెయ్యడం వల్ల నాపై ప్రేక్షకుల్లో ఒక దురభిప్రాయం కలిగింది. చాలా సందర్భాల్లో బయట కలిసిన కొందరితో ప్రత్యక్షంగానే తిట్లు తిన్నాను. ఒకసారి మార్కెట్‌కి వెళితే కూరగాయలు అమ్ముకునే తెలంగాణ ఆవిడ నన్ను చూసి ‘ఏందయ్యా.. పాపం అతన్ని అంత అన్యాయంగా చంపినవ్’ అన్నారు. దానికి నేను ‘అది సినిమా అమ్మా. అందులో నేను ఆ క్యారెక్టర్ చేశానంతే..’ అన్నాను. ‘సినిమా అయితే మాత్రం అంత దారుణంగా చంపుతరా’ అన్నారు. నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇది జరిగి చాలా కాలమైంది. అయితే సినిమా రిలీజ్ అయిన చాలా సంవత్సరాల తర్వాత అమెరికాలో ఉంటున్న ఒక అమ్మాయి ‘నిన్ను చంపెయ్యాలని ఉంది’ అంటూ మెసేజ్ చేసింది. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ తరంలో కూడా ఆ సినిమాకి, అందులోని నా క్యారెక్టర్‌కి అంతగా కనెక్ట్ అవుతున్నారంటే అది నా అదృష్టం అని చెప్పాలి. నేను చేసిన క్యారెక్టర్లు వారిని అంతగా కదిలించాయంటే నటుడిగా నాకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది’ అంటూ వివరించారు తనికెళ్ళ భరణి.
Also Read